8, మే 2015, శుక్రవారం

॥ చేరలేని గమ్యం ॥
అమ్మ అని హత్తుకున్న
ఆరోజులు కావాలని
బుజ్జగించి గోరుముద్దలు 
మళ్ళి తినిపించాలని
నీ బుడి బుడి నడకల్ని
వెనుక కెళ్ళి చూదాలని
అడుగడుగున నీ గెలుపులు
ఆ గర్వం నీదవ్వాలని
సైకిల్ పై నీ స్వారీ
విజయం నీదేనంటూ
నవ్వుతున్న చిన్ని నాన్న
ఆ రూపం మళ్ళి నాదవ్వాలి
నీ జీవన పోరాటంలో
ఓడానూ చివరంటా
ఏమాయనో ఆరోజున
విషమని వేదన మింగా
నీ స్పర్శలు కావాలని
తల్లడిల్లుతున్న మనసు
జ్ఞాపకాల తడులలో
నిన్ను తడుము కుంటున్నా
మౌనమైన మనసులో
నీ మాటలు గుర్తెరిగి
గుండె పగిలి పోతోంది
రాలేవని తలచి తలచి
చెదిరిన ఆశవు నీవు
బాధ్యతల బందీ నేను
చేరలేని గమ్యం నీవు
వేదన బానిస నేను
కంటి తడులు అక్షరమై
కవనమై పోతోంది
చెరపలేని గాయాలు
కావ్యంగా మిగులుతూ
నిశ్శబ్దం మనసులోన
పెదవులనీ కదపలేక
మనసు తడిని తుడవలేను
గాయపు మచ్చను చెరపలేక
అక్షరమే ఆదుకుంది
ఆత్మీయత అందిస్తూ
చెరిగిపోని గాయానికి
చేయూతగ నిలుస్తూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి