8, మే 2015, శుక్రవారం

॥ మనసు తడి ॥
గోడకు వేలాడుతూ నీ యారోగేమ్
అనుక్షణం వెక్కిరిస్తూ
నీవు లేని తనాన్ని గుర్తుచేస్తుంది

టి.వి స్టాండులో దొర్లుతూనే వుంది
నువ్వు ఎగరేసి ఆడిన స్మైలీ బాల్
మరలరాని నీకోసం కన్నీరు తెప్పిస్తూ

నీవు గీసిన కార్టూన్స్ ఫైల్లో దాక్కున్నాయి
మనసులో తడిని కురిపిస్తూ

నిరాశగా చూస్తుంటాయి నా వైపు
బీరువాలో నీ స్పర్శను తాకి
కోరి కొనుక్కున్న దుస్తులన్నీ

మొబైల్లో భద్రంగానే వున్నాయి
నీవాలపించిన భగవద్గీత శ్లోకాలన్నీ
వినపడని స్పర్సించే మాటలు గుండె తడి చేస్తూ

మూగవోయాయి నీ వీడియోగేములు
బ్యాటరి మార్చమని మారాము చేసేవారు లేక
నీ చేతులు నలిపిన కీబోర్డును
నిత్యం తడుముకుంటున్నా చెమరించే కన్నులతో

సూపర్ మార్కెట్కు ఎప్పుడెళ్ళినా
నీవు చేసిన ఫోన్ కాల్ గుర్తొస్తుంది
కిండర్ జాయ్ కావాలని జాయ్ జాయ్ గా అడగడం
మౌనమై పోతుంది మనసపుడు

నీ ఇష్టాలు నాకిపుడు కష్టంగా వున్నాయ్
తీర్చలేని కోరికలన్నీ వేదనగా ప్రశ్నిస్తున్నాయ్

నిన్ను హత్తుకోవాలని ఆత్రంగా వుంది చిన్నా
ఎదురుచూపుతొ కన్నీరు కారుస్తూనే వున్నా ...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి