||అశ్రువులు||
ఓడిన ఆ పోరాటం ఎప్పటికీ గెలవలేను
ఆశపడ్డ ఆశయమే జ్ఞాపకమై మిగిలింది
ఆశపడ్డ ఆశయమే జ్ఞాపకమై మిగిలింది
చిలిపితనాలు గుర్తులై చెమరింతగ మిగిలాయి
తుడవలేని గాయాలు మదిని తడుపుతున్నాయి
తుడవలేని గాయాలు మదిని తడుపుతున్నాయి
విరిగిన మనసునింక అతకలేక పోతున్నా
ఎదలోని వేదనతో బ్రతుకీడ్చుకొస్తున్నా
ఎదలోని వేదనతో బ్రతుకీడ్చుకొస్తున్నా
తీరదులే నా కోరిక మరల రావు నువ్వని తెలుసు
స్మృతిగా నా గుండెలో మెరుస్తూనే వుంటావు
స్మృతిగా నా గుండెలో మెరుస్తూనే వుంటావు
ఇంతకన్నా ఓ అమ్మకి మరో ఓటముంటుందా
బలవంతపు బ్రతుకు కన్నా మరో కష్టముంటుందా
బలవంతపు బ్రతుకు కన్నా మరో కష్టముంటుందా
కన్నీటి సంద్రాన్నిఈదుతూనే వున్నాను
ఓడిన కెరటాన్నై మిగిలిపోతు వున్నాను
ఓడిన కెరటాన్నై మిగిలిపోతు వున్నాను
దూరమయిన దగ్గరితనం నీదే అయిపోయింది
నిట్టూర్పుల తడులతో మునిగి పోతువున్నాను
నిట్టూర్పుల తడులతో మునిగి పోతువున్నాను
అశ్రువులను జయించాలని అక్షరాన్ని ప్రేమించాను
కంటి ముందు కవనంలో కనపడుతూ వున్నావూ
కంటి ముందు కవనంలో కనపడుతూ వున్నావూ
విధి తగిలించిన గాయాలను గేయాలుగా మారుస్తూ
తప్పు నాదేనని తలదించు కుంటున్నా
తప్పు నాదేనని తలదించు కుంటున్నా
నలుగురిలో నడవలేక మనసు మూగబోతోంది
ప్రపంచమే చిన్నదయ్యి మౌనంలో మిగిలింది
ప్రపంచమే చిన్నదయ్యి మౌనంలో మిగిలింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి