21, జులై 2015, మంగళవారం

॥ నాన్న॥
పేరు నిర్ణయించే ప్రక్రియతో
బారసాలపుడే మెదలయిన
నీ బాధ్యతలపర్వం 
తప్పటడుగుల్లో పడిపోకుండా
తప్పు అడుగులు కాకుండా
రెండు కన్నులను వేల కన్నులు చేసుకుని
కొoడంత ధైర్యాన్ని గుండెంత నింపుతూ
అండగా వున్నావు ఆత్మీయమై
నీ చేత అక్షరాభ్యాసం
అక్షరమై దీవించిన నీ ప్రేమ హస్తం
అన్నీ విద్యలు తెలియాలని
ఎక్కడికెళ్ళినా గెలవాలని
తడబాటులసలే ఎదురుకాకూడదని
చేసి చూపిస్తూ చెప్పి చేయిస్తూ
వెన్నంటి వుండి ఎన్ని నేర్పావు
నా కూతురుగా నిన్ను కాదు
నీ తండ్రిగా నన్ను గుర్తించాలని
ఎంత ఆరాట పడ్డావు
అక్షరాలతో నీ సావాసం చెపుతూ
నీ బాటలో నన్ను నడిపించాలని
తాపత్రయమే నీదపుడు
వెన్ను తట్టి ఆత్మస్ధైర్యాన్నిస్తూ
వెనక వుండి నేర్పినవి ఎన్నో
స్పర్శించిన నీ పలుకులు
నేడు దూరమైనా
మనసున మెదులుతున్నాయి భావాలై
ఓడిపోయినపుడు , వేదన నన్ను వరించినపుడు
ఆశించిన ఆప్యాయత అందకున్నా
నీవు నేర్పిన కవితాక్షరాలే హత్తుకున్నా నాన్న
నిన్ను ప్రత్యేకంగా స్మరించడం కాదు నాన్నా
నా కలం కదలికలన్నీ నీవు నడిపిస్తున్న దారులే ....!!
.........వాణి వెంకట్,21 June 15


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి