21, జులై 2015, మంగళవారం

॥ అంతర్వేదన ॥
మనసు గీస్తున్న స్మృతి చిత్రాలన్నీ నీవే
అంతరంగమంతా నీ ఆలోచనలే
ఎదగని ఆశలన్నీ అలుముకున్నాయి
నిరాశగా ప్రశ్నిస్తున్నాయి
ఓడిన ఓటములన్నీ నీవై
గెలవని గెలుపులన్నీ నీకై
తపిస్తున్న మనసు మాటున
మౌన ముద్రగా మిగిలావు
నిన్ను తాకని స్పర్శలన్నీ
నీ కోసం తపిస్తున్నాయి
ఎదలోతుల్లో అయోమయం
గుండెను గిచ్చుతున్న గురుతులు
తల్లడిల్లే తాపత్రయాలు
అలజడిని అధిగమించలేని అంతర్గతాలు
దిశలు గాలిసున్న చూపులు
దాసోహమంటున్న వేదనలు
పొత్తిళ్ళు వదులయ్యాయో ఏమో
పారాడి పోయావు
ఏమార్పుగా ఉన్నానేమో
ఏమార్చి వెళ్ళావు
జీవితాన్ని ఓడిపోయావు నువ్వు
జీవనాన్ని గెలవలేక నేను
పురిటి నొప్పులు మరువనే లేదు
ప్రసవ వేదన గుర్తొస్తూనే వుంది
చిలిపి తనాలు కోoటే వేషాలు
మనసును తట్టి లేపుతున్నాయి
చేజారిన నీ స్పర్శకై
చేయి చాచే ఉన్నాను
మరపు దేవుడిచ్చిన వరమైనా
జ్ఞాపకాన్ని గాలికొదిలెయ్యలేను కదా ...!!
.............వాణి,7 july 15

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి