25, జులై 2015, శనివారం

॥ కడలితో కాసేపు ...॥ 

మనసు తీరం వెంబడే తారాడుతోంది 
స్నేహ కడలిని స్పర్శించాలని 
తనకలాడుతోంది 

గుండె గూటిలో మిగిలేవున్న వేదనంతా 
సముద్రాన్ని హత్తుకుని ఒలికించాలనీ ఉంది 
కొన్ని నిమిషాలు అనుకుంటూ వెళతానా 
ఎన్ని గంటలైనా తనివితీరని ఆరాధనే 

మౌనంతో 
అలల హోరుతో 
సాగుతున్న ముచ్చట్లు 
ఎడతెరిపి లేకుండా 

ఎన్ని దూరాలైనా గుర్తురాని అనందం 
భారాన్ని దించుకుంటున్న సంబరం 
ఒలికే కన్నీళ్ళకి ఓదార్పు తీరం 

తరంగాలు తడుముకుంటూ 
దూరమైన బంధాన్ని హత్తుకున్న అనుభూతి 
అలల పలుకుల ఆలాపనలు 
నిర్వేదం తుడిచే ఆత్మీయం 

వినిపించవు కన్నీళ్ళు 
కనిపించవు గాయాలు 
గుండె  దిగులు మాయమై 
కోల్పోయిన ఆనందాల వరమిచ్చినట్లు 
ప్రతీక్షణం విలువైనదిగా 
వీడలేని బంధమే 

వాత్యల్య పలకరింపులు  
తుఫానులు ఉత్పాతాలు  
బ్రతుకు దెరువుల దీవెనలు 
అన్నీ దాచుకున్న అంతర్యామి సాగరం 

....వాణి 

21, జులై 2015, మంగళవారం

||అక్షరమే||
అక్షరమే అమ్మై ఒదారుస్తోంది
ఎన్ని ఓటములో జీవితములో
వెన్ను తట్టే ధైర్యాన్నీ ఇస్తోంది
గుండె నిండా కన్నీటి కుండలే
చిల్లు పడి ఒలుకుతూనే వున్నాయి
ఒక్కోసారి ఒక్కో కుండ పగిలి
ప్రవహిస్తూ వుంటుంది
అప్పుడూ అక్షరమే
తల్లిగా అక్కున చేర్చు కుంటుంది
.....vani
|| నిర్లిప్తత ||
వెన్నెల వర్షమై కురుస్తున్నా
వేదన వానలో నడుస్తున్నా
చుట్టూ కాంతులు పరిచి వున్నా
మౌనపు చీకటిని మింగుతున్నా
ఎదమీటు రాగాలెదురౌతున్న
మది ఘాతము మాన్ప లేకున్నా
మనసు ఒలికించే నీళ్ళన్నీ
ఆనకట్టలకు ఆగని ప్రవాహాలే
గాయపు గుర్తులు చెరగవులే
మది మాటున మచ్చలై మెరుస్తూ
తడి ఆరని తలపులే నిండుగా
వదనం ఎడారిని తలపిస్తూ
మనసుకైన గాయాలెన్నో
కన్నీటి కడలిలో కొట్టుకుపోయే భావాలెన్నో !!
....వాణి, 20 may 15


॥ అనునయం ॥
రెప్పలు మూసిన సముద్రంలో
కదులుతున్న నీళ్ళు వెలికి రాలేక
మదిని మెలి పెట్టిన గతం 
చిరునవ్వులు మాయం చేసి
చెంపలపై తచ్చాడే
ఒలికించిన కన్నీళ్ళు
ఉప్పటి నీళ్ళు పెదవిని తడుపుతూ
మింగుడుపడని నిర్లిప్తతలు
గొంతు పెగల్చలేక
ఎక్కిళ్ళవుతున్న ఏడుపులు
జ్ఞాపకాన్ని దాచలేక గద్గదమౌతున్నస్వరం
భావాల పరంపరలో ఒదిగిపోతూ అశ్రువులు
చెమరించే మనసులకూ చేరువవుతూ
తీర్పు చెప్పలేని గురుతులు
భారంగా మారిన వర్తమానాలు
తప్పించు కోలేని రాబోవు కాలాలు
భారమైన క్షణాలు సమయాలను లెక్కిస్తూ
కన్నీటి సముద్రంలో
సందేహ నావలా ప్రయాణం
దాటలేని దు:ఖాల గతం
చెరిగిన ఆశలు కవిత్వమై
హృదయవేదనకు ఆలంబమై
ముసురుకున్న మునుపటి గాయాలకు
మౌనంలో నన్ను నేను
అనునయించు కుంటూ
ఓ ఉదాసీనత ... !!
....వాణి, 27 May 15
॥ అనిశ్చితం ॥
ఇంకిపోక మనసులో
వేదన ద్రవాలు వెలికొస్తూనే వున్నా
మనసంతా నిర్లిప్తతలు 
ఎండిన ఆకుల శబ్దాల్లా వినిపిస్తూ
దాటలేని గమ్యాలలో
ప్రశ్నార్ధక పవనాలు వీస్తూ
తీరలేని ఆశయాలు
ఓటములుగా గేలి చేస్తూనే వున్నాయ్
కొన్ని సంగతులు
అవ్యక్త భావాలౌతు
ఎగతాళి చేస్తున్నా
సర్దుకు పోలేని మనసుతో
సహకరించ లేక
నాకు నేనే ఓ ప్రశ్నగా ...!!
....వాణి ,31 may 15
||అక్షరాలు నవ్వాయి||
చీకటి తోసెస్తోంది
వెలుగు మెట్లు ఎక్కనివక
మిణుగురులని అడిగాను
కాస్త దారి చూపమని
నిరాశ నను ప్రశ్నిస్తూ
ఎగతాళిగ నవ్వింది
నిర్లిప్తతని అడిగాను
ఆశనాకు నేర్పమని
మరుపునెంతో అడిగాను
వేదన మానిపించమని
నిశబ్దంగ వెళ్ళింది
మౌనాన్నే అడగమంటు
గాయాలని అడిగాను
గుండెనొదిలి పొమ్మంటు
జ్ఞాపకాన్ని అడగమంది
నేనేమీ చెప్పలేనంటు
చిరునవ్వుని అడిగాను
చిటికెడు హాసాన్నివ్వమని
చెమరింతను అడగమంది
నేనేమీ చెయ్యలేనని
సమధానం దొరకలేదు
ప్రశ్నలన్ని మిగిలాయి
భావాలను పేర్చుకుంటు
అక్షరాలు నవ్వాయి
....వాణి,3 june 15
॥ మౌనం మిగిల్చిన కాలం ॥
వెడలిన కాలంలో వేలాడిన క్షణాలెన్నొ
మౌనం దాచిన పోరాటాలెన్నొ
ఓటమి వేధించిన సందర్భాలెన్నో 
మొలకెత్తని ఆశల విత్తులు
వెలికి తీయలేని నిస్సహాయత
మొలచిన మొలకల్లోనూ
పలుకరిస్తున్న దైన్యాలే
సత్తువ కోల్పోయి ఎదుగుతున్నా
సమస్యల చీకటులే
కొన్ని ఆశయాల కోసం
కష్టంగా చిగుళ్ళని వెలికి తీస్తున్నా
వేర్లలో దాగున్న వెలికి చూపలేని గాయాలెన్నో
కదిలిస్తే కుప్పకూలే కారణాలెన్నో
అడుగుల కంటే ముందే
నల్లని వస్త్రాన్ని కప్పుకుని పరిగెడుతూ
నిరాశల నీడల ప్రయాణం
అభివ్యక్తిలో ఉలికి పాటులెన్నొ
కనిపించక దారులలో తడబాటులెన్నొ
చిరునవ్వు తోడురాకున్నా
చింతను చెరిపేశే
భావాలను తోడుతీసుకుంటూ
గతం గాయాలకి లేపనాలద్దుతూ
ఆనందపు అంకురాలు నాటే క్షణాలకై
వేచిచుస్తూ ... !!
.......... వాణి


॥ ఒక మౌనం ॥
గెలవలేక స్వప్న జగతి
కన్నీటిని రాల్చింది
ప్రశ్నలన్ని ప్రశ్నార్ధకమై 
మౌనాన్నే మిగిల్చాయి
చినుకులై రాలుతున్న
గాయాల జ్ఞాపకాలు
తారాడుతూ కన్నీటిలొ
ఈదలేక మాటరాక
ఉబికి వొచ్చు కన్నీళ్ళు
వెల్లు వెత్తి పాదులలొ
ఆశల మొక్కలేవి
నాటలేక పోయాను
చిమ్మలేక చేతకాక
పారాడే కన్నీటిని
పరచలేక చేవలేక
నవ్వుల తివాచీలను
నిట్టూర్పుల దారులలో
నడకలన్నీ ఆగాయి
నిశబ్ధపు ప్రపంచాన్ని
ఏల లేక మిగిలాను
మౌనాలను మౌనంగా
తోడు చేసుకున్నాను
దు:ఖాల గతాన్ని
అక్షరాలతో కప్పి పెడుతు !
...!..వాణి ,
॥ జ్ఞాపకం ॥
నీ దూరము భారమై
కన్నీటి జలధిలో
జ్ఞాపకాల ప్రయాణం
చేరలేని గమ్యం
మరువలేని నీ పసితానాలు
చుక్కల్లో నువ్వున్నా
ప్రతీక్షణము నాహృదిలో వుంటావు
రాలుతున్నాయి కన్నీళ్ళు
ప్రతి బిందువులో
నీ రూపం చూపిస్తూ
ఓడిపోయాను నిన్ను నేను
దు:ఖాన్ని గెల్చుకుంటూ
పదాలై నీ జ్ఞాపకాలు పంచుకుంటూ ...!!
......వాణి, 14 june 15
॥ ప్రశ్న॥
మనసెంతో సంఘర్షించగ
పుట్టాయి భావాలెన్నొ
మౌనంగా అంతర్మధనం 
ఒలికాయి పదాలు ఎన్నో
మూసుకోదు మనోనేత్రం
తడుపుతోంది జ్ఞాపక గాయం
ప్రకటించదు చిరునవ్వసలే
మాటాడదు మౌనం అంతే
చూపులన్నీ ప్రశ్నార్ధకమే
బదులురాని ఆలోచనలే
రెప్పమూతపడనే లేదు
స్వప్నాలని ఎలా చెప్పను?
తగులుతున్న నిశలే అన్నీ
వెలుగు చూపని దిశలే అన్నీ
గెలవలేని జీవన యజ్ఞం
ఓటమే మిగిలెను సాంతం
తలుస్తున్న ప్రశ్నలు ఎన్నో
తొలుస్తున్న ఆలోచనలొ
కలత మనసునొదిలే పోదు
కన్నీటికి విరామం లేదు
తెరిపిలేని బాదే అంతా
తల్లడిల్లి పోతోంది మనసు
అదుపు లేదు కన్నీళ్ళకసలే
ఆపలేని నిస్సాహాయతలే
అక్షరమే ఆశ్రయ మనుకుని
ప్రశాంతమే అనుకున్నాను
అంతర్జాలపు మాయోయెమో
వెక్కిరింతల మయమే అవుతూ...!!

....... వాణి,18 june 15
॥ అంతర్మధనం ॥
ఏమిటో అర్ధంకాని అంతర్మధనం
ఎందుకో తెలియ కున్నది నైరాశ్యం
దు:ఖం వెలి బుచ్చ లేక దిగులు పడుతూ 
ఆశల్ని నిరాశలు దోచేసినట్టు
గుండెతో గురుతేదో ఘర్షణ పడుతున్నట్లు
లోలోపల మనసంతా లోతుల్ని తవ్వుతోంది

వద్దన్న వినకుండా గాబరా పెడుతూ
కనిపించక ఆత్మేదో ప్రశ్నిస్తూ
స్పర్శించలేక మౌనంగా
మనసుని తడుముతూనే వుంది

మిగిలివున్న కోరికేదో తీరాలని బ్రతిమాలుతూ
ఆ జాలి చూపుకు మనసంత కలచి వేస్తూ
తల్లడింపుతో తడబడుతూ
కొత్తదనం కోసం తపన పడుతూ
మనసు ఆరాట పడుతోంది అక్షరమై ...!
...........వాణి,20 June 15



॥ నాన్న॥
పేరు నిర్ణయించే ప్రక్రియతో
బారసాలపుడే మెదలయిన
నీ బాధ్యతలపర్వం 
తప్పటడుగుల్లో పడిపోకుండా
తప్పు అడుగులు కాకుండా
రెండు కన్నులను వేల కన్నులు చేసుకుని
కొoడంత ధైర్యాన్ని గుండెంత నింపుతూ
అండగా వున్నావు ఆత్మీయమై
నీ చేత అక్షరాభ్యాసం
అక్షరమై దీవించిన నీ ప్రేమ హస్తం
అన్నీ విద్యలు తెలియాలని
ఎక్కడికెళ్ళినా గెలవాలని
తడబాటులసలే ఎదురుకాకూడదని
చేసి చూపిస్తూ చెప్పి చేయిస్తూ
వెన్నంటి వుండి ఎన్ని నేర్పావు
నా కూతురుగా నిన్ను కాదు
నీ తండ్రిగా నన్ను గుర్తించాలని
ఎంత ఆరాట పడ్డావు
అక్షరాలతో నీ సావాసం చెపుతూ
నీ బాటలో నన్ను నడిపించాలని
తాపత్రయమే నీదపుడు
వెన్ను తట్టి ఆత్మస్ధైర్యాన్నిస్తూ
వెనక వుండి నేర్పినవి ఎన్నో
స్పర్శించిన నీ పలుకులు
నేడు దూరమైనా
మనసున మెదులుతున్నాయి భావాలై
ఓడిపోయినపుడు , వేదన నన్ను వరించినపుడు
ఆశించిన ఆప్యాయత అందకున్నా
నీవు నేర్పిన కవితాక్షరాలే హత్తుకున్నా నాన్న
నిన్ను ప్రత్యేకంగా స్మరించడం కాదు నాన్నా
నా కలం కదలికలన్నీ నీవు నడిపిస్తున్న దారులే ....!!
.........వాణి వెంకట్,21 June 15


|| గెలిపించాలి ||
నిందలేసే మరో ఆడది
నిష్టూరమాడె మగాడు
తల్లడిల్లుతున్న తనువు
తనకలాడుతున్న శిశువు
స్వయం నిర్ణయాధికార సామ్రాజ్యమేమీ కాదు జీవితం
బందీ అయిన బ్రతుకే గతం
ఇప్పుడిక ఎదించటం తప్పనిసరి
ప్రతిరూపాన్ని మసకబార నివ్వకూడదు
నిష్పత్తి పెరిగినా తరిగినా
ఒకేలా ఆడజీవితం
కోరికల పర్వాలు
ధనకాక్షంలు
బుసలు కొడుతూనే వున్నాయి
ఎన్ని అవాంతరాలెదురైనా
ఎదురుదెబ్బలు తగిలినా
కడుపున పునాది వేసుకున్న కొత్తజీవితానికి
ఆహ్వానం పలకాల్సిందే
ప్రశ్నలు కోపాలు మామూలే
గెలిపించాలి చిట్టితల్లిని
మృగాళ్ళను ప్రశ్నించే రాక్షసిగా
తీర్చిదిద్దాల్సిందే ...!!
(ఇంకా కొనసాగుతున్న ఇలాంటి సంఘటనలు బాధగా చిన్న ప్రయత్నం )


గాయాల గతాలు గేలి చేస్తుంటే
మనసు మాటై వెలికి రాలేక..
మౌనమే మిగిలింది
నిశబ్దాన్ని హత్తుకున్నాక...!!

భావాల వంతెన నిర్మిస్తున్నా అక్షరాలతో 
అనుభవాల అనుభూతులు పేరుస్తూ ...!!

అక్షరాలే మిణుగురులై
దారి చూపాయి
చీకటి నడకల్లో
మనసు గాయానికి 
లేపనాలద్దాయి
కంటి తడిని తుడుస్తూ...!!

గురుతులెన్నొ మౌనంలో
విప్పలేని పెదవుల్లో
ఆశలెన్నో నిరాశల్లో
గుండె దాచిన గాయాల్లో
జ్ఞాపకాలన్నీ ప్రశ్నలే
బదులులేని సంఘర్షణలే
| గాయమై మిగిలి ||
ఆకాశమూ ఒక్కోసారి నిర్లిప్తంగా
మేఘంలో దాగున్న సూరీడు
కురవలేక ఆగిపోయిన వానజల్లు
అనిర్వచనీయమైన ఆకారం
మాటాడాలని మనసనుకున్నా
నీడలు కూడా తోడు దొరకవు
మిన్నకుండి పోతాను మిన్నును చూస్తూ
నింగి వర్షించలేకున్నా
మనసు వర్షింస్తుంది
నిశీధిని కౌగిలించుకుని
పట్టపగలూ చీకటి వెలిబుచ్చుతూ
చిరుగాలి అలికిడీ వినిపించే నిశబ్దం
స్పందనలేని నన్ను తాకి తరలి వెళ్ళిపోతుంది
అంతరంగ శోధనలోనో
అనంత ఆకాశ వీక్షణలోనో
మౌనoగానే మునిగిపోతాను
వ్యక్తీకరించలేని మనసు
అర్ధంకాని ఆకాశమూ మధ్య
నలుగుతున్న మనసు
ఉక్కిరి బిక్కిరి అవుతూ
బదులు దొరకని ఆలోచన
గాయమై మిగిలిపోతాను
గుండె లోతును స్పర్శిస్తూ ...!!
......వాణి ,4 july 15
॥ యాంత్రికం ॥
స్వార్ధాన్ని కౌగిలించుకుంటు
బంధాల రెక్కలన్నీ రాలి పోతున్నాయి
దూరాల మాటలూ దగ్గరితనాన్ని కోల్పోతూ 
పదాలై కుచించుకు పోతున్న పలకరింపులు
అంతర్జాలపు రెక్కలు అతికించుకుంటూ
వాట్స్ యాప్ లో పలుకులు ఎగిరిపోతున్నాయి
ముఖ పుస్తకాన
శుభోదయాలు, శుభరాత్రులు
బొమ్మల్లో ఇమిడి పోతూ
నచ్చే వాక్యాల కోసం
చూపులై వేచి చూస్తుంటాయి
మౌనం ప్రకటించే మాటలు ఎన్నో
ఎదురు చూసే స్నేహం కోసం
ప్రపంచం వైపు దృష్టి సారిస్తాయి
మాటలు కరువై శబ్ధాలు బరువై
ప్రశాంతత కోల్పోయిన కాలుష్య రాజ్యంలో
కుత్రిమ జీవితాలౌతాయి
బ్రతుకు నటనగా నాలుగు గోడల మధ్య
బందీగా మిగిలిపోతుంది
ఆనందాలు వెతుకుతున్న మనసులకు
సర్ది చెప్పు కుంటూ
గతాలు నెమర వేసుకుంటున్న ప్రపంచం
నిట్టూర్పుల మయం
నిత్యం కొత్తదనాల కోసం
ఎదురుచూస్తూనే జీవనయానం ...!!
....వాణి
॥ అంతర్వేదన ॥
మనసు గీస్తున్న స్మృతి చిత్రాలన్నీ నీవే
అంతరంగమంతా నీ ఆలోచనలే
ఎదగని ఆశలన్నీ అలుముకున్నాయి
నిరాశగా ప్రశ్నిస్తున్నాయి
ఓడిన ఓటములన్నీ నీవై
గెలవని గెలుపులన్నీ నీకై
తపిస్తున్న మనసు మాటున
మౌన ముద్రగా మిగిలావు
నిన్ను తాకని స్పర్శలన్నీ
నీ కోసం తపిస్తున్నాయి
ఎదలోతుల్లో అయోమయం
గుండెను గిచ్చుతున్న గురుతులు
తల్లడిల్లే తాపత్రయాలు
అలజడిని అధిగమించలేని అంతర్గతాలు
దిశలు గాలిసున్న చూపులు
దాసోహమంటున్న వేదనలు
పొత్తిళ్ళు వదులయ్యాయో ఏమో
పారాడి పోయావు
ఏమార్పుగా ఉన్నానేమో
ఏమార్చి వెళ్ళావు
జీవితాన్ని ఓడిపోయావు నువ్వు
జీవనాన్ని గెలవలేక నేను
పురిటి నొప్పులు మరువనే లేదు
ప్రసవ వేదన గుర్తొస్తూనే వుంది
చిలిపి తనాలు కోoటే వేషాలు
మనసును తట్టి లేపుతున్నాయి
చేజారిన నీ స్పర్శకై
చేయి చాచే ఉన్నాను
మరపు దేవుడిచ్చిన వరమైనా
జ్ఞాపకాన్ని గాలికొదిలెయ్యలేను కదా ...!!
.............వాణి,7 july 15
|| అద్దం అంతరంగం ||
అమ్మ గోరు ముద్దలు తింటూ
ఆ చందమామను అద్దంలోనే చూశాను
అందివ్వలేని చందమామను 
అమ్మ చూపింది నమ్మకంగా
కడుపు నింపాలనే తాపత్రయంతో
అప్పుడే పరిచయం అద్దం
కిచ కిచ అంటూ ముక్కుతో గుచ్చుకుంటూ
అద్దంలో తన్నుతాను చూసుకుంటూ
మురిసిఫోతుంది పిచ్చుక
కల్మషమే లేదు నన్ను నన్నుగా
నవ్వుల్లో నవ్వుగా కన్నీటిలో కన్నీరుగా
వదనం ప్రకటించే భావాలన్నీ చూపిస్తూ
ప్రపంచానికి నేనేలా ఉన్నా
నా ప్రతిబింబం అందంగానే
నన్ను పలకరిస్తుంది అద్దంలో
ఒంటరితనంలో నాకు నన్నే తోడుగా
నన్ను నేను ఊత్సాహపరచుకునే ఆలంబనగా
అలంకరణలో అందాలను,
లోపాలను చూపిస్తూ
సవరణలకు స్వాగతించే అవకాశం
మనసుకు అందాన్నీ నమ్మకంగ అందిస్తూ
నన్ను నన్నుగా మెరుగు పరచుకునేందుకు
నిజమే చెపుతుంది అద్దం ....!!
...............వాణి , 7 july 15

వెలుగు కనిపించినా
వెలికి రాలేని కారణాలెన్నో
పంజరమై పోయిన బతుకు
వేదన వెక్కిరిస్తుంటే
మందహాసము బందీ అయ్యింది
చింతల చీకటి మింగేస్తుంటే
దీపాన్ని చేతబూనా
వెలుగునై తిమిరాలను తరిమేయ్యాలని
చీకటి చరిత్రలు తుడిచేస్తూ...!!
|| అస్పష్టత ||
నింగినే నిశితంగా చూస్తూ
ఎగురుతున్న పక్షులు
ఒలుకుతున్న సూరీడు 
మనసు ఎదుగుతుందపుడు
భావమై విహరించాలని
సాలెపురుగు కిటికీకి వేలాడుతూ
కొత్త గూటి నిర్మాణం భలేగా
చువ్వలకి అలవోకగా అల్లేస్తూ
ప్రత్యూషపు ఎండకి మెరుస్తూ
గజి బిజీ గూడే అందంగా
అపుడు మనసుకీ కొత్త ఆలొచన
అక్షరాలను కూడగట్టాలని
పేపర్ తిరగేద్దామని
పెజీలుతిప్పుతానా
మనసుకు ఎన్ని ప్రశ్నలో
మానభంగాలు,మాయారాజకీయాలు
అనాధల దీన గాధలు
తల్లితండ్రుల కన్నీటి కధలు
రోడ్లపై రాలిన జీవిత చరిత్రలు
అపుడూ అనిపిస్తుంది
కొన్ని కన్నీళ్ళను
కొంత ఆవేశాన్నికలమై వ్రెళ్ళగక్కాలని
నిద్రరాని రాత్రి చీకటి చెరిపెయ్యలేను
మనసు గతంలోకి వెళ్ళి గాబరా పెడుతుంది
నిద్రకై జో కొట్టుకోలేక
కొన్ని జ్ఞాపకాలు
పదాలలో పేర్చుకుంటాను
మనసు భారం దించుకుంటూ
ఏవైతేనేం మనసు ప్రసవించే భావాలు
తపన పడుతూ ప్రవహించాలని కవిత్వమై ...!!
.......వాణి
నీ రాకల ఆశలతో
నిత్యం ఎదురుచుపులే
గుండెల్లో గుర్తుగా మిగిలావు
కంటి ముందు కనిపించక
గెలవలేని గాయాలెన్నో
కన్నీటి కడలిని మోస్తూ
నన్ను నేనే మర్చిపోతున్నా
నీ కలల కన్నీళ్ళలొ
అక్షరమై ఒలుకుతోంది మనసు
మాటలు మౌనించాక
మది పుస్తకం నిండి పోయింది
గాయాల చరిత్రతో ....!!