22, సెప్టెంబర్ 2015, మంగళవారం

గుండెకైన గాయాలను తొలగించుట తెలియదులే ॥
మాటాడే స్వరాలకు మౌనించుట తెలియదులే ॥

మదినిండిన వేదనంత ఒలుకుతుంది భావనగా
బాధనిండి పెదవులతో పలికించుట తెలియదులే ॥

నిదురించక కనులముందు కదలాడే నీరూపం
రెప్పమూసి గుండెదిగులు మరిపించుట తెలియదులే ॥

పెదవివిప్పి చెప్పాలని మనసుకెంతొ ఉబలాటం
గద్గదమై గొంతుదాటి ఒలికించుట తెలియదులే ॥

చిందించిన చిరునవ్వులు వెంటాడే జ్ఞాపకాలు
చివురించని ఆనవ్వులు తెప్పించుట తెలియదులే ॥

మరువలేని ఓటములే అనుక్షణం గుర్తొస్తూ
తిరిగిరాని విజయాన్ని గెలిపించుట తెలియదులే ॥

మౌన'వాణి' మదిదిగులుతొ ఏదేదో ఆలోచన
గుండెల్లో గుర్తులన్ని సడలించుట తెలియదులే ॥
......... వాణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి