22, సెప్టెంబర్ 2015, మంగళవారం

కంటితడులే మౌనభాషగ మిగులుతూనే ఉన్నవీ ॥
నవ్వులన్నీ చూపుఎదురుగ చెదురుతూనే ఉన్నవీ ॥
కలతమనసున కలవరములే హృదినితడితొ నింపుతుంటే
మౌనగాయపు గురుతులన్నీ రేగుతూనే ఉన్నవీ ॥
అడుగుఅంటిన ఆశలేగా అందలేని నీదుస్పర్శలు
నిరాశలతో ఎదలోతులు నిండుతూనే ఉన్నవీ ॥
మరువలేనివి నాటినవ్వులు మరలమరలా మెదులుతూ
జ్ఞాపకాలే కంటితడులను ఒలుకుతూనే ఉన్నవీ ॥
చెదిరిపోయెను తీపిస్వప్నం వేదనేగా బతుకుసాంతం
మిగిలివున్నవి ఆనవాళ్ళే తడుముతూనే ఉన్నవీ ॥
మసకబారిన క్షణాలెన్నో మధుర'వాణీ' మనసుగదిలో
మనసునోచ్చిన ఘటనలన్ని రగులుతూనే ఉన్నవీ ॥
......వాణి
||తెగిన బంధపు తీగకు వేలాడుతూ…………||

తెగిన బంధపు తీగకు వేలాడుతూ
ఆరని వేదనతో అల్లాడుతూనే వున్నాను
అశ్రువులు అక్షరాలుగా మారుస్తూ 
తల్లడింపుతో తనకలాడుతూనే వున్నాను

ఒలుకుతున్న కన్నీటిలో
నీ రూపాన్నిచుస్తూ
నిదురలేని నిరాశ మనసు
మూగతో మాటాడుతోంది

వెగటు జీవితం వెక్కిరిస్తోంది
గతమంతా గాయపు పొరలు
తెగిపోని కన్నీటి పొరలు
కొత్త తెరలు తీయలేను

కొసకు చేరవు కన్నీళ్ళు
ఆఖరిని అందుకోలేక అశ్రువులు
గుండెల్లో మిగిలిన గాయం
ఆకిందనే ఆగిన ఆ నవ్వులు

అపుడు పడ్డ వేదన
ఇంకా కంటిముందే దీన ద్రశ్యమై
నా మీద నాకే జాలిగా
పేగు పగిలిన శబ్దమై వినిపిస్తూ
రాలిపోతే బావుండని........!!
||పారాడే చెమరింతను.........||

అక్షరమే ప్రపంచమై మసలుతున్న
గాయపడ్డ శిలను నేను

గెలవలేని ఓటమినే హత్తుకున్న
జీవన పోరాట కెరటాన్ని నేను

చేజారిన పోత్తిళ్ళకై తారాడుతూ నిశిధిలో
తడబాటు అడుగులతో నడుస్తున్న నీడ నేను

గుండెంతో భారమై చిన్ని నవ్వు దూరమై
బతుకుతున్న బాధ్యతల బంధకాన్ని నేను

జీవన చట్రంలో బంధమొకటి రాలింది
వెన్ను విరిగి పారాడే చెమరింతను నేను
||అంతుచిక్కని కన్నీరుగా మిగిలి...........||

జ్ఞాపకాలు దహిస్తున్నాయి
నువ్వు చేజారిన క్షణాల్లోకి తరలిస్తూ
వేదన వెలిబుచ్చ లేని అనాధనై పోతున్నా

నాకు నా వాళ్ళకు మధ్య
కన్నీరై అడ్డు పడుతున్నానేమో
మౌన దు:ఖ యాతన గాయమై స్రవిస్తోంది

నీ అర్దాయుస్సుకు నా ఆయువును జోడించ లేనపుడు
నీ అంతిమ ప్రయాణం ఆపలేక పోయాను
నన్ను ముగించుకోలేని నిస్సహాయత
పగిలిన పేగు గాయమై
అంతరంలొ రుధిర ప్రవాహం

అక్షరాలు ప్రకటించలేని నిర్వేదమపుడు
బతుకు సాంతం మరువలేని మనసు అలజడి
నీ వు లేని తనంతో తల్లడిల్లుతున్నా
ఆత్మీయతలకు అర్ధం కాని అంతర్వేదన
ఎదుటి వారికి ఎగతాళిగానే నిత్య సంఘర్షణ

మమతలు కరువై మౌనం బరువై
భావాలలో నన్ను బంధించు కుంటున్నా
అక్షరాలతొ మాటాడు కుంటున్నా
బాధ్యతల బందిఖానాలో బతుకీడుస్తూ
ఆత్మీయ ఆలింగనానికి దూరమైన
అంతుచిక్కని కన్నీరుగా మిగిలిపోయా.......!!
నిశబ్దమై పోతున్నా నీవు లేని లోకంలో ॥
చేష్టలుడిగి మిగులున్నా నీవు లేని పయనంలో ॥

నిరాశలతొ మనసంతా దిగులుగుండే మోయుచు
ఆశలెన్నో మిగిలిపోయె నీవు లేని ప్రశ్నలలో ॥

గాయాలని చెరపలేక గమనాన్ని ఆపలేక
దిక్కులన్ని వెతుకుతున్న నీవు లేని యామినిలో॥

కనురెప్పల అలికిడిలో నీ స్మరణే వినిపిస్తూ
వెతకలేక పోతున్నా నీవు లేని చూపులలో ॥

నిట్టూర్పుల తడులలోన స్పర్శించే నీ పేరే
తాకలేక తడుముతున్న నీవు లేని జాడలలో ॥

మధుర'వాణి' అక్షరంలొ ప్రతిపదము నీదేలే
భావాలనె ఒలుకుతున్న నీవు లేని ధ్యాసలలో॥

......... వాణి
గుండెకైన గాయాలను తొలగించుట తెలియదులే ॥
మాటాడే స్వరాలకు మౌనించుట తెలియదులే ॥

మదినిండిన వేదనంత ఒలుకుతుంది భావనగా
బాధనిండి పెదవులతో పలికించుట తెలియదులే ॥

నిదురించక కనులముందు కదలాడే నీరూపం
రెప్పమూసి గుండెదిగులు మరిపించుట తెలియదులే ॥

పెదవివిప్పి చెప్పాలని మనసుకెంతొ ఉబలాటం
గద్గదమై గొంతుదాటి ఒలికించుట తెలియదులే ॥

చిందించిన చిరునవ్వులు వెంటాడే జ్ఞాపకాలు
చివురించని ఆనవ్వులు తెప్పించుట తెలియదులే ॥

మరువలేని ఓటములే అనుక్షణం గుర్తొస్తూ
తిరిగిరాని విజయాన్ని గెలిపించుట తెలియదులే ॥

మౌన'వాణి' మదిదిగులుతొ ఏదేదో ఆలోచన
గుండెల్లో గుర్తులన్ని సడలించుట తెలియదులే ॥
......... వాణి
కంటిముందు వేదనలా .....

వెలుగొదలని నీడలా నువ్వు గుర్తొస్తున్నావు
మనసొదలని జాడలా నువ్వు గుర్తొస్తున్నావు

మరల రాని లోకానికి తరలి వెళ్ళిపోయావు
తలపుల్లో మాటలా నువ్వు గుర్తొస్తున్నావు

మనసంతా నిండివున్న మౌనంలా మారినా
స్వప్నంలో తోడులా నువ్వు గుర్తొస్తున్నావు

వేలుపట్టి నడిపించిన క్షణాలే జ్ఞాపకమై
మరువలేని శ్వాసలా నువ్వు గుర్తొస్తున్నావు

మూసివున్న రెప్పలలో కనిపిస్తూ ఉంటావు
కంటి ముందు వేదనలా నువ్వు గుర్తొస్తున్నావు

ఓడిపోయి పోరాటం గెలుపు రుచి ఎరుగ లేదు
కానరాని నీ రూపం కలలా నువ్వు గుర్తొస్తున్నావు

కలమూ కన్నీరొలుకుతు కవనాలే ఆల్లుతోంది
పదాలలో మౌనంలా నువ్వుగుర్తొస్తున్నావు

అమ్మ అన్న నీ పిలుపులు ఆలాపనలోనేగా
ఆరాటపు ఉలుకులా నువ్వుగుర్తొస్తున్నావు

....వాణి
....మౌనం తలదించుకుంది ....

నీ చిరునవ్వు జారి పోయాక
చీకటి చిత్రంగా అల్లుకుంది

గుండెలోని సముద్రం ఎండి పోవడం లేదు
ఉప్పు నీళ్ళను వర్షి స్తూనే వుంది

వెన్నెల తుంపరలూ రాలిపడ్డం లేదు
విషాద నిిశీ ధి కమ్ముకుంది నాపై

గాయాలగాట్లు గుండెల్లో మంట రేపుతున్నాయ్
నిట్టూర్పుల శబ్దాన్ని శృతిచేస్తూనే వున్నాయ్

వెన్నంటే వస్తోంది నిశ నా నీడనూ చూడనీక
మౌనం తలవంచుకుంటోo౦ది
నిరాశతో ప్రపంచాన్ని పలుకరించలేక

అమ్మ ఒడి ఖాళీ చేసి వెళ్ళి పోయావేo
గునపమై గుచ్చుకుంటోంది మది

నాలుకతో వెక్కిరిస్తే తుంటరి పని చేశావనుకున్న
గుండె తడిగా మిగిలుతావనుకోలా
||చెమరింత చేరువయ్యింది ....||

అక్షరాలు బెట్టు చేస్తున్నాయి
వ్యధను వెలిబుచ్చ లేక

భావాలు మొరాయిస్తున్నాయి
బాధను ప్రకటించ లేక

సిరా నిండు కుంటోంది
కన్నీటిని ప్రోది చెయ్యలేక

మనసు తడి ఆరడం లేదు
మౌన సంఘర్షణ వీడలేక

చెమరింత చేరువయ్యిందిగా
చిరునవ్వు దూరమయ్యిందిక

భారమైనా భరిస్తున్నాననేమో
వద్దన్నావెంటాడుతుంది వేదన

కన్నీరు కౌగిలించు కుందనేమో
బంధాలు దూరముంచాయి....!!
రెప్పల వాకిళ్ళు మూసుకున్నా
నిదుర ఒడి చేరుకోడం లేదు
గురుతులు గుండె గాయాన్ని తెరుస్తుంటే
మనసు మౌనాన్ని వీడిపోవడం లేదు 
జ్ఞాపకాల చప్పుళ్ళు వినిపిస్తుంటే
హృదిన నీరెండి పోయిందేమో
రుధిరాన్ని స్రవిస్తున్నాయి కనులు ...!!
విరిగిపోయిన కలలు 
చీకటి జ్ఞాపకాలు 
కదలాడే దృశ్యాలు 
చివరకు చేరుకోని చింతలు 
ఆఖరిని అందుకొని అశ్రువులు 
అంతరాల్లో ఆటుపోట్లెన్నొ
ఆనవాళ్ళుగా మిగిలి అక్షరాల్లో
చిరునవ్వై మిగలాలని ..........


ఆశ అలుగుతూనే వుంది
నిత్యం నిరాశే గెలుస్తోందని
నవ్వులన్ని చిన్నబుచ్చుకున్నాాయి
కన్నీళ్ళు కౌగిలించుకోగానే
అక్షరాలూ చికాకుపడుతున్నాయి
మనసుతడిలో ఇమడలేమంటూ.
నిదురమ్మ కెప్పుడూ కోపమే
చింతలోపడి తనని మరిచానని
విషాదాలు రోషంగా వెళ్ళి పొతే
చిరునవ్వై మిగిలిపోతా ....!!
||పలుకునై పరవశించాలని...........||
గాయాల కుదుళ్ళను
పెకిలించాలని వుంది
మౌనాల శబ్దాలను
పగులగొట్టాలని వుంది
నిశను చీల్చి వెన్నెల వర్షాన్ని
కురిపించాలని వుంది
వెలుగుల వానలో
కన్నీటి తడులను
కలిపేయాలని వుంది
మాటలు రాని మౌన ప్రపంచంలో
పలుకునై పరవశించాలని వుంది .....!!
..........వాణి,22sep15