25, ఆగస్టు 2015, మంగళవారం

.. చెదిరిన కలలు.....
ఆగని ఆ కన్నీటి ప్రవాహాలకి పైటకొంగే ఆమెకి
ఓదార్పు నేస్తం అవుతుంది
ఒక్కోసారి కారణం తెలియని కన్నీళ్ళెన్నో
తలగడలో ఇంకి పోయి ఆవిరై పోతూ వుంటాయి
కడలి తీరoలో సరదాగా కట్టుకున్న గుజ్జనగూళ్ళు
ఆనవాళ్ళు లేకుండా చెరిపెస్తాయి ఆత్రంగా వచ్చే అలలు
మనసు లోగిలిలో నిర్మించుకునే కలల సౌదాలెన్నో...
విధిరాతను ఎదుర్కోలేక ఆ స్వప్నాలన్నీ
కాల గమనంలో కుప్పకూలిపోతాయి
కొన్ని బంధాల తీగలు తెగినపుడు
ఆ తీగలను అతకలేక
ఉన్న తీగలతోనే రాగాలాలపించాలని ప్రయత్నిస్తాo
శ్రావ్యంగా లేకున్నా సర్ధుకుపోడానికి అలవాటు పడతాo
ఎన్నో వ్యధలు కొన్ని జీవితాల్లో
చెరిగిపోనీ జ్ఞాపకాలను చెరపలేక
ఆత్మీయమైన అక్షరాల ఆదరణ అందుకుంటూ
............ వాణి
|తలంపు||
మౌనంగా నా శ్వాసల శబ్ధాలు వినపడనంతగా
నైరాశ్యపు ఊబిలో కూరుకు పోతాను
ఆలోచనల మధ్య ఓ ఆత్మ సంచరిస్తూ వుంటుంది
స్పర్శలు దూరమైనా
గురుతులు గుండెను తట్టి లేపుతుంటాయి
చుట్టూ మనుష్యుల సంచారం వున్నా
ఒంటరి తనాన్ని ఏలుతుంటాను
కాస్త హాయి కావాలనో
నిర్వేదాన్ని వెల్లడించడం కోసమో
సముద్రపు తోడు కావాలనిపిస్తుంది
ఊప్పునీటి కంటి చెమ్మను
కడిలి తడిలో కలిపేయాలనిపిస్తుంది
కాసేపలా ఇసుకపై వాలతాను
చుట్టూ పరికించాలని కూడా అనిపించదు
ఏదో నిర్లిప్తత
తీరాన్ని తడిపే ప్రయత్నంలో
కెరటాలు పోటీ పడుతూనే వుంటాయ్
ఒక్కసారి ప్రక్కకు చూస్తే
వయసు తేడాలేని తనువులు ఎన్నో
అలల ఊయలలు ఊగుతుంటాయ్
వాళ్ళ ఆనందాలు నాకేమీ అనిపించవు
విరక్తిగా ఓ నవ్వును కూడా వెల్లడించలేక పోతాను
నన్ను మాత్రం జ్ఞాపకాలు సుడిగుండంలో చుట్టేస్తూ వుంటాయ్
తడి ఇసుకలోనే గీతలు గీస్తూ
అంతరంగాన్ని తడుముకుంటూ
నిరాశా,నిర్వేదం, నిశీధులతో తర్జన భర్జన పడుతూ
మాటేసిన మౌనాలతో మాటాడుకుంటూ వుంటాను
మరో గెలుపు దొరకని ఓటమిని అంగీకరించ లేక పోతుంటాను
మనసు విజయకాంక్షను ఆకాంక్షిస్తూనే వుంటుంది
పునర్జన్మలో ప్రాప్తిస్తుందేమోనని
నిట్టూర్పుల తడిలో తడుస్తూ వుంటాను
నిస్పృహను అలవాటు చేసుకున్నానేమో
నాలోని నాకే సర్ధి చెప్పుకుంటాను
అయినా..
బాధ్యతలేవో వెన్ను తట్టి నపుడు
కొత్త ప్రపంచం కావాలని
ముందరి నడకలైనా సాఫీగా సాగాలని
యోచననో మునిగి పోతాను....!!
......వాణి, 
॥ చేయూత॥
కాసేపల ఒంటరి తనాన్ని మరచి అలలతో ముచ్చటిద్దామని
సాగరతీరాన్నిఆలింగన చేసుకుంటాను
కెరటాల శబ్ధాలతో మౌనంగా ఎన్ని ముచ్చట్లో.. 
పొద్దుగూకినా పట్టించుకోనంతగా
పాదాలు తాకే అలలు సంకేతిస్తు
మౌనఊసులు వింటున్నట్లుగా
చుట్టూ చీకట్లు వున్నా
కాస్త వెలుగును పంచుతూ చందమామ
తరంగాలతోను తనతోను ఎన్ని సంభాషణలో
మనసు నిశ్శబ్ధంగా వున్నా
అలల అలికిడులను ఆస్వాదిస్తున్నా
పెదవులు పలుకులు వెలిబుచ్చకున్నా
మానసముతో మాటాడుతున్నా
మది తలుపు తడుతున్నట్లుగా వుంది
మూసుకున్న సంతోషాలేవో
నిరాశలు, అశ్రువులు
సాగరంలో నిమజ్జనం చేసినట్లుగా వుంది
అంతరంగం నిర్వేదంతో నిండిపోయినా
కన్నీరుకావాలనిపించడం లేదు
సంద్రాన్ని హత్తుకోగానే
సంతోషాన్ని కౌగిలించుకున్నట్లుగా వుంది
అంత వరకు బుజ్జగించిన చేతిరుమాలు
జారిపోయింది సంద్రంలోకి
కన్నీటిని తోడు తీసుకుని ....!!
......... వాణి కొరటమద్ది,
.....పదాల ప్రేమలో .....
దు:ఖాన్ని వీడలేక మనసంతా
తుఫాను నాటి కడలిలా అల్లకల్లోలమే
భావాలకై తడుముకుంటూ
మనసంత శోధిస్తూ
లోతుల్ని తవ్వుకుంటూ
అక్షరాల ప్రపంచాన్ని హత్తుకుంటాను
మిళిత బిందువువులెన్నో
అక్షరాలుగా మారిపోయాయి
తడిసిన కనులు అలసిపోయి
బాధను ప్రకటిస్తుంటాయి
నీటిని ఆర్పుకుంటూ
కాగితం సొట్టలతో ఉబ్బిపోతుంది
తల్లడిల్లే మనసులానే
సహజత్వాన్ని కోల్పోతుంది
ముడుచుకున్న కాగితంలో
ఇంకిన కన్నీళ్ళు కనిపిస్తూ
మనసులోని అశ్రువులన్నీ
ఆవిరైనట్లు అనిపిస్తూ
అక్షరాలనే హత్తుకుంటాను
పదాల ప్రేమలో
విహంగమై విహరిస్తుంటాను
అక్షరాల స్నేహంతో
చెలిమి విలువ తెలిసింది
భావాలే ప్రకటిస్తూ అనుక్షణం..!!
... ......వాణి, 
॥ మౌనం కావాలని॥
ముందరి కాలానికి సంకెళ్ళు
జ్ఞాపకాలు వెల్లువెత్తినపుడు
అంతరంగ దృశ్యం కనిపించి
మనసు భారాన్ని మోయలేక పోతాను
కన్నీళ్ళు ఒలికిస్తూ
వెన్నుతట్టే ఓదార్పుగా
గోడనే ఆసరా చేసుకుంటాను
కదలికలను చూడలేక
నేలను కన్నీటితో చూస్తుంటాను
ముడుచుకున్న మోకాళ్ళనే
ఆసరా చేసుకుంటూ
మౌనంగా మనసును స్పర్శిస్తాను
వస్తువుల కదలికలు ఆగిపోతే బావుండని
నిశ్శబ్ధంలోకి తోసెస్తే బావుండని
మౌనాన్ని వెంట తీసుకుని
మనసులోకి నడవాలనిపిస్తుంది
సానుభూతి చూపులను దూరంగా విసిరెయ్యాలని
ఒంటరి బాదే అపుడు ఓదార్పుగా అనిపిస్తుంది
కోల్పోయిన గురుతులను
మనసుతో హత్తుకోవాలనిపిస్తుంది
...వాణి ,

23, ఆగస్టు 2015, ఆదివారం

|| గాయపు గుర్తులు ||

నిరాశల్లో మిగిలిపోయా
లేలేత మొగ్గగా నువు రాలిపోతే

కన్నీటి అడుగులే
తప్పని బ్రతుకు పోరాటం

మనసు తడి చేసిన నిన్నటి గాయాలు
తల ఎత్తలేని నిర్వేదం నాదై
నా నీడలోనే నీ జాడలు వెతుకుతున్నా

ఓడిన మనసే నాది
నిన్ను కోల్పోయిన శూన్యమై
తప్పటడుగువై తరలి వస్తావని

మౌనాన్ని నేను హత్తుకుంటాను
గురుతులలో నీ సవ్వడిని ఆస్వాదించడానికి

గుండె గాయం చెపుతుంది
నా నవ్వులూ నా సొంతం కాదని

గాయపడ్డ గతాలే గుర్తొస్తున్నాయి
సంతోష సందర్భాలు మర్చిపోతూ

ప్రమోదాలు పరిహసిస్తూనే ఉన్నాయి
విషాదాల నెలవులో నిలవలేమంట

మనసు భరించలేక పోతోంది
జ్ఞాపకాల ఉలి దెబ్బలు

రాలిపడ్డ ఆశలే
గమ్యం చేరేలోగా చిగురించక పోతాయా? అని

వేదన అక్షరమై వెలికి వస్తోంది
మది అగాధాన్ని తవ్వుకుంటూ....!!

.......వాణి , 21 August 15
కలగా...........
రాలి పోయిన బంధంతో
తల్లడిల్లుతోంది మనసు
బతుకు కలలను కల్లలు చేస్తూ
దు:ఖమొకటి హత్తుకున్నది
రెప్ప మూతపడ్డమే లేదు
నిదుర ఎలా సాధ్యం
కునుకునే మరిచాననేమో
కలలూ అలిగి వెళ్లి పోయాయి
ఒక్కసారి స్వప్నమై కనిపించవూ
మెలుకువలు మర్చిపోతాను ...!!
.......వాణి , 23 August 15

21, ఆగస్టు 2015, శుక్రవారం

ఓటములు గెలవలేనివిగా
మిగిలినపుడు
గాయాన్ని మరువలేక
జ్ఞాపకమే స్నేహమయ్యింది
తుడవలేని కన్నీళ్ళకు
అక్షరమే నేస్తమయ్యింది
బాధను వెలిబుచ్చిన భావాలు
తల్లడిల్లిన స్నేహ హస్తాలు
సాహిత్యమే స్నేహమై
కవిత్వమే ప్రపంచమై
నన్ను నాకుగ ఓదార్చే అక్షరాలు
నా భావాలే నేస్తాలు
గతం గాయమే అయినా
సేద తీర్చిన భావాల స్నేహం
ముఖ పరిచయం లేకున్నా
ముఖపుస్తక మిత్రులెందరో
ప్రత్యేక రోజేమీ లేదు
వదలలేని అలవాటుగా మారిన
ముఖపుస్తకం నిత్యం స్నేహం
ఆత్మీయత చాటుకుంటునే
స్నేహ పూర్వక పలుకరింపులు
ప్రోత్సహించే స్పందనలు
నేస్తాలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
...........వాణి
॥ ఆశ ॥
చినుకుకై తపనపడే నేల ఎండి
పగుళ్ళతో తెరుచుకుంది
గాయపు గుర్తులతో
గొంతు ఎండుతూ
తడి ఆరని మనసు
కన్నీటి వర్షంలో
నోటితో శ్వాసిస్తుంది
చినుకై తపిస్తున్న నేలకి
మొలకెత్తే విత్తుని పొదువుకోవాలని ఆరాటం
మనసేమో హత్తుకునే ఆత్మీయతకై తపించటం
ఎండిన ఆకులు
కన్నీటి శబ్దాన్ని వినిపిస్తాయి
మౌనాల ఒంటరితనం
బీడు నేలను తలపిస్తుంది
విరిగిన మనసు
మట్టికి వానకి మధ్య బంధంలా
ఆత్మీయ మాధుర్యాన్ని కోరుకుంటుంది
చిగురించని చెట్టు
చిరునవ్వును మరచిన మనసు
చిగురై చిందించాలని ఆశ పడుతుంది
............వాణి ,8 August 15


మౌనించిన నిశ్శబ్దాలు
మిగిలే ఉన్న నీ ఆనవాళ్ళు
చూపునై నింగిలోతారాడుతున్నా
వెలుగుతో ఒలికొస్తావేమోనని
మందహాసమూ బందీ అయ్యి
చింతల చీకటి మింగేస్తుంటే
ఎడారైన మనసులో ఇంకా
కొలువుదీరే ఉన్నాయి కన్నీళ్ళు
చెరిగిపోని శిలాక్షరాలుగా
చిరునవ్వులు చేజారయనేగా
చూపులన్నీజాలిగా పలకరిస్తున్నాయి...!!


॥ వేదన ॥
నీ దూరం చేసిన గాయం
మనసు భారాన్ని మోయలేక
ప్రసవ వేదన మళ్ళీ గుర్తొస్తుంది
నిన్ను కోల్పోయిన సంఘర్షణ నుండి
తేరుకోలేక తారాడే నిశీధినయ్యాను
మిణుగురులూ మోసగించాయి
మిటకరించకుండా
నిశి నడకల్లో బోర్ల పడుతూనే ఉన్నాను
చీకటి నిండిన దైన్యంలా
చెవులు రిక్కించే ఉన్నాను
శబ్దించే స్ధలాన్ని చేరాలని
కన్నీటి సంద్రంలో దారి తప్పిన నావనై
ఈదుతూనే ఉన్నాను
ఆత్మీయ తీరం చేరాలని ...
........ వాణి


|| గాయపు గుర్తులు ||
నిరాశల్లో మిగిలిపోయా
లేలేత మొగ్గగా నువు రాలిపోతే
కన్నీటి అడుగులే
తప్పని బ్రతుకు పోరాటం
మనసు తడి చేసిన నిన్నటి గాయాలు
తల ఎత్తలేని నిర్వేదం నాదై
నా నీడలోనే నీ జాడలు వెతుకుతున్నా
ఓడిన మనసే నాది
నిన్ను కోల్పోయిన శూన్యమై
తప్పటడుగువై తరలి వస్తావని
మౌనాన్ని నేను హత్తుకుంటాను
గురుతులలో నీ సవ్వడిని ఆస్వాదించడానికి
గుండె గాయం చెపుతుంది
నా నవ్వులూ నా సొంతం కాదని
గాయపడ్డ గతాలే గుర్తొస్తున్నాయి
సంతోష సందర్భాలు మర్చిపోతూ
ప్రమోదాలు పరిహసిస్తూనే ఉన్నాయి
విషాదాల నెలవులో నిలవలేమంట
మనసు భరించలేక పోతోంది
జ్ఞాపకాల ఉలి దెబ్బలు
రాలిపడ్డ ఆశలే
గమ్యం చేరేలోగా చిగురించక పోతాయా? అని
వేదన అక్షరమై వెలికి వస్తోంది
మది అగాధాన్ని తవ్వుకుంటూ....!!
.......వాణి , 21 August 15