11, జూన్ 2015, గురువారం

॥ పోతున్నా ॥ 
జ్ఞాపకాల గాయాలను చెరపలేక పోతున్నా ॥
చిట్టితండ్రి నీజాడలు వెతకలేక పోతున్నా॥
ఒడిఏలిన నీరాజ్యం నీకోసం వేచుంది
రాలేవని నీరాకను తలవలేక పోతున్నా॥
రెప్పలపై తచ్చాడుతు నీ అలికిడి జ్ఞాపకాలు
తనువుకూడ గాయమౌతు కదలలేక పోతున్నా ॥
కనిపించే దూరములో రూపమేది కనపడినా
నీవేనని తలపించీ నిలువలేక పోతున్నా॥
చీకటులూ వెన్నెలలూ ఒకటిగానె కనిపిస్తూ
తడపడుతూ గమ్యాలనె చేరలేక పోతున్నా॥
చిగురించక ఆశలేవి చతికిలపడి పోయాను
మదిలోపలి అలజడులను గెలవలేక పోతున్నా॥
వెల్లువెత్తి చిరునవ్వులు ఒక్కసారె నిష్క్రమించె
విరిగిపోయి మనసునింక అతకలేక పోతున్నా ॥
కదలాడక కనిపించక చేజారే పోయావూ
కలువరించు నీరూపం తాకలేక పోతున్నా॥
నిదురలేని రాత్రులలో మౌనంతో పోరాటం
మనసుకైన గాయాలను మాన్పలేక పోతున్నా ॥
చెమరించే బిందువులను భావాలుగ మార్చుకుంటు
అమ్మఇచ్చుఈకానుక చేర్చలేక పోతున్నా ॥
మదిలోతున వినపడుతూ బోసినవ్వు తియ్యదనం
స్పర్శించే 'వాణి'యలుగ అందలేక పోతున్నా ॥
స్వప్నములే హిమముగా కరిగిపోతు వున్నాయి
ఆశించిన శిఖరాలను చేరలేక పోతున్నా ॥
......వాణి,22 may 15

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి