11, జూన్ 2015, గురువారం

॥ కన్నీరు ॥
గుండెలోని వేదనంత ఒలుకుతోంది అశ్రువుగ
హృదిలోపలి చెమరింతే తడుపుతోంది ఖేదనగ ॥
విప్పలేని పెదవులతో చెప్పలేని బాధలే
మౌనమొకటి మనసంతా తడుముతోంది రోదనగ ॥
నీశీధులు నిరాశలతొ కనిపించని వెలుగులులే
మది గాయం జ్ఞాపకమై త్రవ్వుతోంది కన్నీరుగ ॥
దూరమైన బంధమేదొ దరికిరాని ప్రేమలతో
ఊహలతో తలపులతో పలుకుతోంది లాలనగ॥
మధుర'వాణి' నిశబ్దమే రచియించే భావాలే
కన్నీటిని కవనాలుగ మార్చుతోంది ఓదార్పుగ॥
....వాణి , 12 May 15
॥ పోతున్నా ॥ 
జ్ఞాపకాల గాయాలను చెరపలేక పోతున్నా ॥
చిట్టితండ్రి నీజాడలు వెతకలేక పోతున్నా॥
ఒడిఏలిన నీరాజ్యం నీకోసం వేచుంది
రాలేవని నీరాకను తలవలేక పోతున్నా॥
రెప్పలపై తచ్చాడుతు నీ అలికిడి జ్ఞాపకాలు
తనువుకూడ గాయమౌతు కదలలేక పోతున్నా ॥
కనిపించే దూరములో రూపమేది కనపడినా
నీవేనని తలపించీ నిలువలేక పోతున్నా॥
చీకటులూ వెన్నెలలూ ఒకటిగానె కనిపిస్తూ
తడపడుతూ గమ్యాలనె చేరలేక పోతున్నా॥
చిగురించక ఆశలేవి చతికిలపడి పోయాను
మదిలోపలి అలజడులను గెలవలేక పోతున్నా॥
వెల్లువెత్తి చిరునవ్వులు ఒక్కసారె నిష్క్రమించె
విరిగిపోయి మనసునింక అతకలేక పోతున్నా ॥
కదలాడక కనిపించక చేజారే పోయావూ
కలువరించు నీరూపం తాకలేక పోతున్నా॥
నిదురలేని రాత్రులలో మౌనంతో పోరాటం
మనసుకైన గాయాలను మాన్పలేక పోతున్నా ॥
చెమరించే బిందువులను భావాలుగ మార్చుకుంటు
అమ్మఇచ్చుఈకానుక చేర్చలేక పోతున్నా ॥
మదిలోతున వినపడుతూ బోసినవ్వు తియ్యదనం
స్పర్శించే 'వాణి'యలుగ అందలేక పోతున్నా ॥
స్వప్నములే హిమముగా కరిగిపోతు వున్నాయి
ఆశించిన శిఖరాలను చేరలేక పోతున్నా ॥
......వాణి,22 may 15
॥ బ్రతుకు పోరాటం ॥
నిర్లిప్తతను జోడిస్తూనే రాని చిరునవ్వును చెక్కిలి కంటిస్తూ
జీవితం ముగింపు దశలో వున్నా
బ్రతుకు మీద ఆశ పడుతూనే 
తల త్రిప్పీ కంటి తడిని తుడుచుకుంటూ
తల్లడిల్లే తన బంధాలను చూడలేని నిస్సహాయత
కనిపించని గాయమే, కృంగదీస్తూ తనువునంతా
సామాన్యులు గెలవలేని మాయదారి రోగమే
ఎదురుచూచే దాత కోసం వేచివుండి బ్రతుకుకోసం
నిత్యం దర్శించే దేవాలయమే ఆసుపత్రి
వైద్యుడిని దేవుడిగా కొలవాల్సిందే
ఫీజుల సంభావన సమర్పించాల్సిందే
చిరునవ్వైనా చిత్కారమైన
బ్రతుకుదాతగా దయచూపమని మోక్కాల్సిందే
కార్పొరేట్ ఆసుపత్రుల ఖజానా నింపీ దరిద్రుడుగా
గుండె నిండా కంటి తడులు దాచుకుంటు
రక్తశుద్దికి శరీరం సహకరించక
నిత్యం సూదులతో సావాసం
యంత్రాల మధ్య బ్రతుకుతో సంగ్రామం
ధనానికి ,దానానికి మధ్య జీవన పోరాటం
కొన్ని అక్షరాలు వారి కోసం కన్నీళ్ళు కారుస్తూ ....!!
.....వాణి ,23 May 15
||అక్షరాలు నవ్వాయి||
చీకటి తోసెస్తోంది
వెలుగు మెట్లు ఎక్కనివక
మిణుగురులని అడిగాను
కాస్త దారి చూపమని
నిరాశ నను ప్రశ్నిస్తూ
ఎగతాళిగ నవ్వింది
నిర్లిప్తతని అడిగాను
ఆశనాకు నేర్పమని
మరుపునెంతో అడిగాను
వేదన మానిపించమని
నిశబ్దంగ వెళ్ళింది
మౌనాన్నే అడగమంటు
గాయాలని అడిగాను
గుండెనొదిలి పొమ్మంటు
జ్ఞాపకాన్ని అడగమంది
నేనేమీ చెప్పలేనంటు
చిరునవ్వుని అడిగాను
చిటికెడు హాసాన్నివ్వమని
చెమరింతను అడగమంది
నేనేమీ చెయ్యలేనని
సమధానం దొరకలేదు
ప్రశ్నలన్ని మిగిలాయి
భావాలను పేర్చుకుంటు
అక్షరాలు నవ్వాయి
....వాణి,3 june 15
॥ మౌనం మిగిల్చిన కాలం ॥
వెడలిన కాలంలో వేలాడిన క్షణాలెన్నొ
మౌనం దాచిన పోరాటాలెన్నొ
ఓటమి వేధించిన సందర్భాలెన్నో 
మొలకెత్తని ఆశల విత్తులు
వెలికి తీయలేని నిస్సహాయత
మొలచిన మొలకల్లోనూ
పలుకరిస్తున్న దైన్యాలే
సత్తువ కోల్పోయి ఎదుగుతున్నా
సమస్యల చీకటులే
కొన్ని ఆశయాల కోసం
కష్టంగా చిగుళ్ళని వెలికి తీస్తున్నా
వేర్లలో దాగున్న వెలికి చూపలేని గాయాలెన్నో
కదిలిస్తే కుప్పకూలే కారణాలెన్నో
అడుగుల కంటే ముందే
నల్లని వస్త్రాన్ని కప్పుకుని పరిగెడుతూ
నిరాశల నీడల ప్రయాణం
అభివ్యక్తిలో ఉలికి పాటులెన్నొ
కనిపించక దారులలో తడబాటులెన్నొ
చిరునవ్వు తోడురాకున్నా
చింతను చెరిపేశే
భావాలను తోడుతీసుకుంటూ
గతం గాయాలకి లేపనాలద్దుతూ
ఆనందపు అంకురాలు నాటే క్షణాలకై
వేచిచుస్తూ ... !!
.......... వాణి

5, జూన్ 2015, శుక్రవారం

................నిర్వేదం.............
వర్ణాలేవీ కానరానంతగా
మానసం తిమిరాన్ని నింపుకుంది
గమ్యం చీకటి నే సూచిస్తూ 
నలుపు రంగు హత్తుకుపోయింది
మెరిసే రంగులేవీ మురిపించడం లేదు
ప్రపంచాన్ని చూడ్డమే లేదూ
కాసేపలా నింగి నీలపు రంగు
ఆహ్లాదిద్దామంటే
పొద్దుగూకాక చీకటి నిండిన ఆకాశం
నిరాశ గా కనిపిస్తుంది
ఒక్కోసారి కడలిని చూడ్డానికి వెళతానా
అపుడూ నీటి రంగు కంటికి కనపడదు
నిర్వేదం నింపుకున్న మనసు
కడలికి కష్టాన్ని వల్లే వెయ్యడమే సరిపోతుంది
వర్ణాలేవీ కనపడనంతగా
జ్ఞాపకాలు పెనవేసుకున్నాయ్
చెరపలేని గాయాలన్నీ
చిందరవందర చేస్తూనే వున్నాయ్
ఇంద్రధనువు రంగులన్నీ
ఆవహించుకుంటే బావుండనిపిస్తుంది
హరివిల్ల్లునై రంగుల్లో మెరిసిపోవాలనిపిస్తుంది
...............వాణి
||వేదన||
మది నగరంలో వెల్లువెత్తే కన్నీటి తరంగాలు
భావాల అలలై ఆగని అక్షరాల ప్రవాహాలు
నిశ్శబ్ధపుఊహలు నీవే అవుతుంటే
నాలోకి నేనే నడిచినట్లుగా వుంది
దు:ఖాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో
నిశిలో నడుస్తూ చీకటిలో వెతుకుతూ
ఆశల రెక్కలు అతికించుకుంటూ
వెన్నెల వెలుగులు విరజిమ్మే రాత్రులకై
కనిపించని మదితో పోరాడుతూనే వున్నా
చరిత్రలో నువ్వు కలిసిపోయావు
కాలం ఒడిలో నేను కరిగి పోతున్నాను
చిధ్రమైన సంతోషాలు కావాలనిపిస్తుంటే
షడ్రుచుల సమ్మేళనమే జీవితమనుకుంటాం
చేదురుచే నాలుకపై తచ్చాడుతుంటే
కొత్త సంవర్శరానికి పలుకుతున్నా స్వాగతమంటూ
గాయాల గతాన్ని మరిపిచే శక్తి నివ్వమంటూ
మెదులుతూ నీ తప్పటడుగులు
మరువలేను నీ బోసి నవ్వులు
ఒడి ఊయలలో ఊపిన ఆక్షణాలు
పంచుకునే నీవు లేక
మరో లోకంలో నీ వున్నా
నీవే లోకంగా జీవిస్తున్నా...!!
.....వాణి
||అక్షరమే||
అక్షరమే అమ్మై ఒదారుస్తోంది
ఎన్ని ఓటములో జీవితములో
వెన్ను తట్టే ధైర్యాన్నీ ఇస్తోంది
గుండె నిండా కన్నీటి కుండలే
చిల్లు పడి ఒలుకుతూనే వున్నాయి
ఒక్కోసారి ఒక్కో కుండ పగిలి
ప్రవహిస్తూ వుంటుంది
అప్పుడూ అక్షరమే
తల్లిగా అక్కున చేర్చు కుంటుంది
.....vani
|| నిర్లిప్తత ||
వెన్నెల వర్షమై కురుస్తున్నా
వేదన వానలో నడుస్తున్నా
చుట్టూ కాంతులు పరిచి వున్నా
మౌనపు చీకటిని మింగుతున్నా
ఎదమీటు రాగాలెదురౌతున్న
మది ఘాతము మాన్ప లేకున్నా
మనసు ఒలికించే నీళ్ళన్నీ
ఆనకట్టలకు ఆగని ప్రవాహాలే
గాయపు గుర్తులు చెరగవులే
మది మాటున మచ్చలై మెరుస్తూ
తడి ఆరని తలపులే నిండుగా
వదనం ఎడారిని తలపిస్తూ
మనసుకైన గాయాలెన్నో
కన్నీటి కడలిలో కొట్టుకుపోయే భావాలెన్నో !!
....వాణి, 20 may 15
॥ అనునయం ॥
రెప్పలు మూసిన సముద్రంలో
కదులుతున్న నీళ్ళు వెలికి రాలేక
మదిని మెలి పెట్టిన గతం 
చిరునవ్వులు మాయం చేసి
చెంపలపై తచ్చాడే
ఒలికించిన కన్నీళ్ళు
ఉప్పటి నీళ్ళు పెదవిని తడుపుతూ
మింగుడుపడని నిర్లిప్తతలు
గొంతు పెగల్చలేక
ఎక్కిళ్ళవుతున్న ఏడుపులు
జ్ఞాపకాన్ని దాచలేక గద్గదమౌతున్నస్వరం
భావాల పరంపరలో ఒదిగిపోతూ అశ్రువులు
చెమరించే మనసులకూ చేరువవుతూ
తీర్పు చెప్పలేని గురుతులు
భారంగా మారిన వర్తమానాలు
తప్పించు కోలేని రాబోవు కాలాలు
భారమైన క్షణాలు సమయాలను లెక్కిస్తూ
కన్నీటి సముద్రంలో
సందేహ నావలా ప్రయాణం
దాటలేని దు:ఖాల గతం
చెరిగిన ఆశలు కవిత్వమై
హృదయవేదనకు ఆలంబమై
ముసురుకున్న మునుపటి గాయాలకు
మౌనంలో నన్ను నేను
అనునయించు కుంటూ
ఓ ఉదాసీనత ... !!
....వాణి, 27 May 15
॥ అనిశ్చితం ॥
ఇంకిపోక మనసులో
వేదన ద్రవాలు వెలికొస్తూనే వున్నా
మనసంతా నిర్లిప్తతలు 
ఎండిన ఆకుల శబ్దాల్లా వినిపిస్తూ
దాటలేని గమ్యాలలో
ప్రశ్నార్ధక పవనాలు వీస్తూ
తీరలేని ఆశయాలు
ఓటములుగా గేలి చేస్తూనే వున్నాయ్
కొన్ని సంగతులు
అవ్యక్త భావాలౌతు
ఎగతాళి చేస్తున్నా
సర్దుకు పోలేని మనసుతో
సహకరించ లేక
నాకు నేనే ఓ ప్రశ్నగా ...!!
....వాణి ,31 may 15
||అక్షరాలు నవ్వాయి||

చీకటి తోసెస్తోంది
వెలుగు మెట్లు ఎక్కనివక
మిణుగురులని అడిగాను
కాస్త దారి చూపమని
నిరాశ నను ప్రశ్నిస్తూ
ఎగతాళిగ నవ్వింది
నిర్లిప్తతని అడిగాను
ఆశనాకు నేర్పమని
మరుపునెంతో అడిగాను
వేదన మానిపించమని
నిశబ్దంగ వెళ్ళింది
మౌనాన్నే అడగమంటు
గాయాలని అడిగాను
గుండెనొదిలి పొమ్మంటు
జ్ఞాపకాన్ని అడగమంది
నేనేమీ చెప్పలేనంటు
చిరునవ్వుని అడిగాను
చిటికెడు హాసాన్నివ్వమని
చెమరింతను అడగమంది
నేనేమీ చెయ్యలేనని
సమధానం దొరకలేదు
ప్రశ్నలన్ని మిగిలాయి
భావాలను పేర్చుకుంటు
అక్షరాలు నవ్వాయి

....వాణి,3 june 15