8, నవంబర్ 2015, ఆదివారం

|| అనిశ్చితం....||

కలత మనసులో కరుగుతున్న కాలంలో
కనులుజార్చు నీటిలో కధనాలు ఎన్నో

మార్పుతెచ్చిన గమనాలు  దు:ఖాలు మోస్తూనే
భారమైన గతాలలో భంగపడ్డ సందర్భాలెన్నో

కుప్పకూలిన మనసుకు
చేయూతందించక
విదిలించిన ఆత్మీయతలు
విసుక్కున్న క్షణాలెన్నొ

ఆత్మవిశ్వాసాలపై నీళ్ళుచల్లే
అతిమంచితనాలు
మమతలద్దని బంధాల
వేర్పాటు వాదాలెన్నో

చూపులకతిశయమైన
అక్షరాల ఓదార్పులు
మౌనద్వేషాలు ప్రకటించిన
అనుబంధాలెన్నో

చెక్కుకున్న నవ్వులకు
ఎదురయ్యే విరుపుల చికాకులు
బలవంతపు మాటల్లో
భేషజాలెన్నో

తీరిన అవసరాలు
మనసులు మరచిన ఆ గుర్తులు
శేష ప్రశ్నగా మిగిలిన
చెమట చుక్కల గుర్తులెన్నో

గుండెనోదలని గాధలు,
జ్ఞాపకం కార్చిన కన్నీటి చుక్కలు
అక్షరాలొలికె అమ్మ ప్రేమతో
మౌనం పలికే భావాలెన్నో ....!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి