8, నవంబర్ 2015, ఆదివారం

మౌన గాయo .........
మౌన వేదనలో మమతలకు దూరమై
నిదుర మరచి గెలవలేని స్వప్నాన్నై
విధి లిఖించిన ఓటమికి బానిసనై 
చీకటిలో చిలికే అక్షరాన్నై
మది సంఘర్షణతో పోరాడే సమిధనై
గాయాల గుదిబండకు తడబడే అడుగునై
మూతపడని రెప్పల చప్పుడుకు ఓడిన కలనై
జ్ఞాపకాల్లో మిగిలిన ఆనవాళ్ళు మోసే వ్యధనై
కనులు సముద్రాలలో తేలియాడే అలనై
మదిన శాంతి లేని కలతనై
వ్యధల కన్నీరు మోసే కలకంఠినై
చేజారినా నవ్వులు.. ఆగిపోని ఊపిరినై
చేయి చాచి తపించే చెమరింతనై
మిగిలివున్న మౌన గాయాన్ని .....!!
నన్ను నేను ఓడిపోతూ…………….
కలల హాసాలు లేవు కల్లోల మనసులో
స్వప్న సంతోషాలు దూరమే మౌన సంఘర్షణలో
చెరపలేని చేదు నిజాలు 
చేరువవని చిరు మందహాసాలు
నాటి నీ గెలుపు ఆనందాల ముచ్చట్లు
మదిన మెదిలే మౌనాల చప్పట్లు
హోరెత్తిన కారు చీకట్లు
అడుగులేస్తూనే ఉన్నా అడుగడుగునా
నీ అడుగులకై గాలిస్తూ
సడలుతున్నాయి కీళ్ళు నీ ఆసరాకై తపిస్తూ
కన్నీటి వాకిళ్ళు తెరచి
వెతుకుతూనే వున్నా వేదనతోనే
నిన్నందుకోలేక నా పిలుపు తరంగాలు
సాగుతున్నాయి ఎడారి నడకలు
గొంతు తడుపుతూ కన్నీటి చుక్కలు
కూరుకుపొతున్నాయి పాదాలు
కుప్పకూలిన మనసుతో
తారాడుతున్నా మదిలోతుల్లో మందహాసాలు
వదనంలో చెక్కుకుంటున్నాచిటికెడు చిరునవ్వులు
కనులోతుల్లో దాచుకుంటు కన్నీటి ధారలు
కంటి తడులను వెలికి రావొద్దని బ్రతిమాలుకుంటూ
అవసరాల ఆవేశాలు .. తొలగిపోని ఆవేదనలు
నన్ను నేను ఓడిపోతూ.... చేరలేని గెలుపుతీరాలు …!!
నిస్పృహ......................
తడుముకుంటూనే వున్నా అనుక్షణ౦ పోత్తిలిని
అంకురమై మళ్ళీ ఎదుగుతున్నావేమోనని
ఆశ పడుతూనే వున్నా
తల్లడిల్లే మనసుకు తోడ్పాటువై
తరలోస్తావేమోనని
సాగిపోతున్నాయి నీ జన్మ దినాలు
పెరిగే నీ వయసును గుర్తుచేస్తూ
కృంగ దీస్తున్నాయి సంవత్సరాలు
నీ ఎడబాటును లెక్కిస్తూ
ఆత్మస్ధైర్యం నీ అంతిమ ప్రయాణానికి అంకితమై
కునికిపాట్లు కుంగుబాట్లలో కలసిపోయి
తప్పడం లేదు బాధ్యతల పయనం
తడబాటుల కన్నీటి గమనం
యాంత్రికమైన జీవితం.....!! 
!! కాంతి కావాలనిపిస్తూ.....!!

జ్ఞాపకాల పుటలు విచ్చుకుంటున్నాయి
గమనాలను బంధిస్తూ

నిట్టూర్పుల నవ్వులలో గుర్తులోలుకుతున్నాయి
కాలాన్ని భారంగా మోస్తూ

ప్రశ్నార్ధక వందనంలో
జవాబు దొరకడం లేదు

చీకటి చిక్కుముడి విప్పలేక
వెన్నెల చుక్కలకై వేటాడుతున్నా

నిశల నిధులను కప్పెట్ట లేక
చెకుముకి రాళ్ళ కై వెతుక్కుంటున్నా

తిమిరాలలో తడిసిపొతూ
కాంతి కిరణాలకై తపిస్తున్నా

శోధనలో
సాధనకై
స్పష్టత సంక్లిష్టమై
సాగిపోతున్నాయి సమయాలు
సవరణలు స్వాగతిస్తూ ...!!

గాయపు శిలని
కన్నీటి తరగని
నిశ్చల సముద్రాన్ని 
నిత్య వేదనని 
ఇంకిపోని చెలమని 
ఎదురుచూడని ఆశని
మౌన నిర్లిప్తతతని
చిలికే అక్షరాన్ని
ఆగని కవనాన్ని ...!!
|| అనిశ్చితం....||

కలత మనసులో కరుగుతున్న కాలంలో
కనులుజార్చు నీటిలో కధనాలు ఎన్నో

మార్పుతెచ్చిన గమనాలు  దు:ఖాలు మోస్తూనే
భారమైన గతాలలో భంగపడ్డ సందర్భాలెన్నో

కుప్పకూలిన మనసుకు
చేయూతందించక
విదిలించిన ఆత్మీయతలు
విసుక్కున్న క్షణాలెన్నొ

ఆత్మవిశ్వాసాలపై నీళ్ళుచల్లే
అతిమంచితనాలు
మమతలద్దని బంధాల
వేర్పాటు వాదాలెన్నో

చూపులకతిశయమైన
అక్షరాల ఓదార్పులు
మౌనద్వేషాలు ప్రకటించిన
అనుబంధాలెన్నో

చెక్కుకున్న నవ్వులకు
ఎదురయ్యే విరుపుల చికాకులు
బలవంతపు మాటల్లో
భేషజాలెన్నో

తీరిన అవసరాలు
మనసులు మరచిన ఆ గుర్తులు
శేష ప్రశ్నగా మిగిలిన
చెమట చుక్కల గుర్తులెన్నో

గుండెనోదలని గాధలు,
జ్ఞాపకం కార్చిన కన్నీటి చుక్కలు
అక్షరాలొలికె అమ్మ ప్రేమతో
మౌనం పలికే భావాలెన్నో ....!!

14, అక్టోబర్ 2015, బుధవారం


నిత్య నివేదన....

నిశ్చల జ్ఞాపకాలు నిత్యం భారంగా
ఇంకిపోని గుండెలోని నీరు
చీకటికై ఎదురుచూస్తూ 
ఒలకాలని ఆత్రంతో
ఏ నడి రాతిరో
కన్నీళ్ళ కళ్ళాపి చల్లుతాయి కాగితంపై
కొంత దిగులు అక్షరాల్లొ ఒలికి
మరికొంత వేచి చూస్తూ
నిత్య నివేదన కన్నీళ్ళు చీకటికి
తడిచిన తలగడ సాక్ష్యమే ప్రోద్దుటికి
ఆరబెట్టుకుందుకు భానుడికి స్వాగతమంటాయి
రెప్పమూయ లేని దు:ఖం రేయిలో
బాధ్యతల ఉలికిపాటు వేకువలో…!!