14, అక్టోబర్ 2015, బుధవారం


నిత్య నివేదన....

నిశ్చల జ్ఞాపకాలు నిత్యం భారంగా
ఇంకిపోని గుండెలోని నీరు
చీకటికై ఎదురుచూస్తూ 
ఒలకాలని ఆత్రంతో
ఏ నడి రాతిరో
కన్నీళ్ళ కళ్ళాపి చల్లుతాయి కాగితంపై
కొంత దిగులు అక్షరాల్లొ ఒలికి
మరికొంత వేచి చూస్తూ
నిత్య నివేదన కన్నీళ్ళు చీకటికి
తడిచిన తలగడ సాక్ష్యమే ప్రోద్దుటికి
ఆరబెట్టుకుందుకు భానుడికి స్వాగతమంటాయి
రెప్పమూయ లేని దు:ఖం రేయిలో
బాధ్యతల ఉలికిపాటు వేకువలో…!!
|| కన్నీటి చుక్కగా మిగిలిపొతూ …….||
ప్రపంచానికి కనిపించని కన్నీళ్ళు
ఆత్మీయత కోల్పోయిన దు:ఖాలూ
భారం దింపుకోలేని అలసినగుండె 
బరువుగా నడిచే కాలం
తీరం చేరని అశ్రువులు
తిరిగి రాలేక చిరునవ్వులు
వేదన విసిరెయ్యలేక
వేడుకను ఆస్వాదించలేక
మొహమాటపు మందహాసాలు
చూపుల తిరస్కారాలు
జ్ఞాపకాల చరిత్రను తవ్వి
వెక్కిరిస్తుంటాయి
ఎదురునిలిచిన సందర్భాల్లో
మమతను అందుకోలేని ఆరాటంలో
కన్నీటి చుక్కగానే మిగిలిపొతూ
ప్రశ్నార్ధక పయనంలో........!!
......వాణి ,5 sep 15
స్పర్శించే అక్షరాన్నై....................


నిత్యమైన కన్నీటి వర్షానికి
మది మోస్తున్న కారణాలెన్నో
జ్ఞాపకాల గురుతులోలికి
భారమైన గుండె సలుపులెన్నో
బలవంతపు బ్రతుకు యానంలో
తనువూ పడుతున్న నొప్పులెన్నో
కలతల కాలాన్ని కదిలించడానికి
నన్ను నేను ఓదార్చుకున్న సందర్భాలెన్నో
మౌన వేదనలో.. మది సంఘర్షణలో ..
విప్పలేని మాటలలో.. మర్మాలెన్నో
కరిగి పోయిన కలలు కన్నీటి మడుగులే
ఓడిన బంధాన్ని ఉహగా హత్తుకున్న క్షణాలెన్నొ
తరలిన అడుగులకి నిత్యాన్వేషణ
తలపులలో తప్పటడుగుల ఉలికిపాటులెన్నో
తనువు మోసిన నువ్వే తరలివెళ్ళిపోయి
తిరిగిరాని నీకై తపించే తల్లడింపులెన్నో
స్పర్శించే అక్షరాన్నై తనకలాడుతున్నా
భావాల కౌగిలిలో బంధించు కుంటున్న క్షణాలెన్నో ....!!